కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటా రూ.6 వేలు చెల్లిస్తోంది. 3 విడతల్లో ఒక్కో రైతుకు రూ. 2 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి అంతే మొత్తాన్ని అందిస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేస్తారనే వార్తలు గత కొన్ని రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనే ఈ ప్రకటన చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దీనిపై సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంటు వేదికగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపుపై కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చేసింది.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పెంపు ప్రకటన చేస్తారని అంతా భావించారు. తాజాగా ఈ నిధుల పెంపు గురించి పార్లమెంట్ వేదికగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే మొత్తాన్ని ఇప్పట్లో పెంచే ఆలోచనే ఏదీ లేదని అర్జున్ ముండా తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఇప్పుడు ఏడాదికి ఉన్న రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచే ఉద్దేశం ఏదీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మహిళా రైతులకు కూడా ఈ పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు దేశంలోని 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు జమ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి 43 లక్షలు.. తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఏటా 3 విడతలుగా రూ.2 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.6 వేలు అందిస్తోంది.