ఓ వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నాడు. అయితే నేషనల్ హైవేపై వెళ్తుండగా.. అనుకోని ప్రమాదం ఎదురైంది. వీధి కుక్కలు వారి కారుకు అడ్డు రాగా.. వాటిని తప్పించబోయిన ఆ వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న మైలు రాయిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా.. అతని భార్య మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు మ్యాటర్ మొదలైంది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదే అంటూ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై తానే కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. తన భార్య చావుకు కారణం తానేనని తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని నర్మదా జిల్లాకు చెందిన 55 ఏళ్ల పరేష్ దోషి అనే వ్యక్తి ఈ కేసు పెట్టుకున్నాడు. తన భార్య అమితతో కలిసి పరేష్ దోషి.. ఇటీవల అంబాజీ ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. ఖేరోజ్-ఖేద్‌బ్రహ్మ నేషనల్ హైవేపై.. సబర్‌కాంతా ప్రాంతంలోని దాన్ మహుడి గ్రామం వద్ద వారి కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న వీధి కుక్కలను తప్పించబోయి.. పరేష్ దోషి కారును పక్కకు తిప్పాడు. దీంతో రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లకు కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది.
ఈ ఘటనలో తనకు తానే నిందితుడిగా భావించిన పరేష్ దోషి.. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసుకున్నాడు. కుక్కను ఢీకొట్టడం తప్పించబోయి.. తాను రోడ్డు పక్కన ఉన్న పిల్లర్లు, బారికేడ్లను ఢీకొట్టినట్లు వివరించాడు. టీచర్‌గా పని చేస్తున్న పరేష్ దోషి.. ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన భార్యతోపాటు కారులో అంబాజీ ఆలయానికి బయల్దేరామని.. అక్కడికే చేరుకునే సరికి మధ్యాహ్నం కావడంతో ఆలయం మూసివేసినట్లు తెలిపారు. అయితే మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అంబాజీ ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయని.. ఆ తర్వాత తమ గ్రామమైన సుఖ అంబాకు ప్రయాణం ప్రారంభించినట్లు వివరించాడు. అయితే అప్పుడే హైవేపై వీధి కుక్క ఎదురైందని.. దాన్ని తప్పించేందుకు ప్రయత్నించగా.. ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతో రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లు విరిగి కారు లోపలికి చొచ్చుకువచ్చి.. తన భార్య అమితకు గుచ్చుకున్నట్లు పరేష్ దోషి వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులు వెంటనే వచ్చి తమను ఆ కారులో నుంచి బయటికి తీసుకువచ్చినట్లు వివరించాడు. అయితే ఈ ఘటనలో తన భార్య చనిపోవడంతో.. తనపై తానే కేసు పెట్టుకున్నాడు. తాను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన గుజరాత్‌లో వీధి కుక్కల సమస్యలను మరోసారి గుర్తు చేసింది. గత ఏడాది గుజరాత్‌లో వీధి కుక్కల బెడద గురించి ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధి కుక్కల సమస్య వల్ల చాలా మంది పౌరులకు మార్నింగ్ వాక్ చేయడానికి భయపడుతున్నారని పేర్కొంది. గుజరాత్‌లో పెరుగుతున్న వీధికుక్కల సమస్యను నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.