ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీ నరసింహారావు కోసం ఎన్టీఆర్ త్యాగం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2024, 07:20 PM

పాములపర్తి వెంకట నరసింహారావు.. ఇలా అనే కంటే పీవీ అంటేనే తెలుగు ప్రజలకు ఇష్టమేమో. ఆ పేరుతో తెలుగు ప్రజలకు ఉన్న అనుబంధం అలాంటిది. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన వేసిన ముద్ర అలాంటిది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి నాయకుడిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దార్శనికుడిగా, ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన అపర చాణిక్యుడిగా, 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగల బహుభాషా కోవిదుడిగా.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో. సాధారణంగా రాజకీయాల్లో ఓ పార్టీ వారంటే మరొక పార్టీకి గిట్టదు. కానీ ఏ పార్టీ వ్యక్తికి అయినా ఇష్టుడు పీవీ. రాజకీయాల్లో అజాత శత్రువుగా అదీ ఆయన ఠీవీ.


పీవీ నరసింహారావుకు భారతరత్న వచ్చిన సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తుచేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ధోరణితో విసిగిపోయి, రాష్ట్రాలు, ముఖ్యమంత్రుల పట్ల ఆ పార్టీ అగ్రనేతల తీరుపై ఆగ్రహంతో తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టారు నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన ఆరునెలల్లోనే అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పట్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అంటే ఉప్పూనిప్పులా ఉండే పరిస్థితి. కానీ పీవీ కోసం ఓ త్యాగం చేశారు ఎన్టీఆర్.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన పీవీ నరసింహారావు..1977లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. హన్మకొండ నుంచి రెండుసార్లు, నంద్యాల నుంచి ఒకసారి, ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి ఓసారి ఆయన లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. 1980 నుంచి 89 మధ్య ఆయన కేంద్రంలో హోంశాఖ, విదేశాంగ, మానవవనరుల అభివృద్ధి శాఖ వంటి కీలక శాఖలను నిర్వహించారు. అయితే 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్‌రాని పరిస్థితి ఏర్పడింది. పార్టీ మ్యానిఫెస్టో బాధ్యతలు అప్పగించింది. దీంతో పీవీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని చాలా మంది భావించారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరగవు. విధి మరోలా భావించింది.


1991లో ఊహించని విధంగా రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. ఎందరో నేతలు తెరమీదకు వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. ప్రధాని పదవి కోసం ఎంతో మంది నేతలు, ఉద్ధండులు పోటీ పడ్డారు.కానీ అజాత శత్రువు, మృదుస్వభావి అయిన పీవీ వైపు మొగ్గు చూపారు సోనియా గాంధీ. ఆయన సారథ్యంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పటికి ఆయన ఎంపీ కాకపోవటంతో ఆరునెలల్లోగా ఎంపీగా లోక్‌సభకు ఎన్నిక కావాల్సిన పరిస్థితి.


దీంతో పీవీ కోసం నంద్యాల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన గంగుల ప్రతాపరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అక్కడి నుంచి ఉపఎన్నికల బరిలో దిగారు పీవీ నరసింహారావు. అయితే నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి కూడా గట్టి పట్టు ఉంది . టీడీపీ బరిలో ఉంటే హోరాహోరీ పోరు సాగే పరిస్థితి. కానీ ఎన్టీఆర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. పీవీకి వ్యతిరేకంగా టీడీపీ నుంచి ఎవరినీ పోటీకి నిలపలేదు. బీజేపీ నుంచి బి. లక్ష్మణ్ పోటీచేశారు. అయితే ఎన్టీఆర్ పీవీ గెలుపుకోసం పనిచేశారు. నాటి ఎన్నికల్లో సుమారు ఐదు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు పీవీ.


అయితే పీవీ నరసింహారావుపై పోటీ పెట్టకపోవటంతో జాతీయ మీడియా నుంచి కూడా ప్రశ్నలు ఎదుర్కొన్నారు ఎన్టీఆర్. ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉన్నారా అంటూ అప్పట్లో నేషనల్ మీడియా విలేకర్లు ఎన్టీఆర్‌ను ఓ సందర్భంలో ప్రశ్నించారు. దానికి అన్నగారు ఇచ్చిన జవాబు పీవీ అంటే ఆయనకు ఉన్న గౌరవం, పీవీ నరసింహారావు స్థాయిని తెలియజేస్తుంది. ఒక తెలుగువాడికి, అందునా సాహిత్య పిపాసి అయిన వ్యక్తికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందనీ, తెలుగువాడు ప్రధాని అయితే తెలుగు ప్రజలుగా మనందరికి గర్వకారణమని ఎన్టీఆర్ అప్పుడు అభిప్రాయపడ్డారు. అలాగే సాహిత్యంతో పాటు బహుభాషా కోవిదుడు అయిన పీవీ ప్రధాని అయితే సంస్కృతీ, సంప్రదాయాలకు మరింత ప్రాధ్యానం పెరుగుతుందని చెప్పారు. అందుకే టీడీపీ నుంచి పోటీ పెట్టలేదంటూ పీవీ పట్ల అభిమానం చాటుకున్నారు.


అలాగే తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చేవారట. రాజకీయంగా వేర్వేరు పార్టీలు అయినా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. ఇక పీవీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతా జగమెరిగిన సత్యమే.. దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలలో పీవీ వేసిన ముద్ర జగద్వితమే..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com