ఆత్మగౌరవంపై దెబ్బకొట్టి, తనను ఆవేదనకు గురిచేశారన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. తమ గ్రామంలోనూ తనకు తెలియకుండా సమావేశం పెట్టాలని చూశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పదవులు, సంపాదన కోసం ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలను భయపెట్టి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చూస్తున్నారన్నారు.
ఇక్కడ తనకు జరుగుతున్న అవమానాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 2019లో గెలిచాక ఎమ్మెల్యే ఏ కార్యక్రమానికీ తనను పిలవలేదని.. తనను పలకరించిన వాళ్లను ఇబ్బంది పెట్టారన్నారు. వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని చెబుతూనే.. బడుగుల మనోభావాలను గుర్తించడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం ఏ పదవులూ ఆశించకుండా తాను వైఎస్సార్‌సీపీలో చేరానని.. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇవ్వాలని అనుచరులను కోరారు.
ఇటీవలే గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జంగా స్వగ్రామమైన దాచేపల్లి మండలం గామాలపాడులో ఆసరా చెక్కులు అందివ్వాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. గ్రామ సర్పంచిగా కృష్ణమూర్తి కుమారుడు జంగా సురేష్ ఉన్నారు. వీరిద్దరి ఫొటోలు లేకుండా ఎంపీగా పోటీ చేయనున్న అనిల్‌కుమార్‌యాదవ్ ఫోటోలతో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బ్యానర్లు వేయించారు. ఆగ్రహించిన జంగా వర్గీయులు వాటిని తొలగించారు. ఇరువర్గాల వారు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం కనిపించింది.
చెక్కుల పంపిణీపై సర్పంచి, ఎమ్మెల్సీకి సమాచారం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు సర్పంచ్ సురేష్. తాము చెప్పామని వారు బదులివ్వగా, మొక్కుబడిగా శనివారం సాయంత్రం చెబితే ఏర్పాట్లు ఎలా చేస్తామని సర్పంచి ప్రశ్నించారు. శివారు గ్రామమైన శంకరాపురంలోనూ చెక్కుల పంపిణీకి తనను ఆహ్వానించకపోవడంపై సురేష్ ప్రశ్నించారు. పల్నాడు పల్లెల్లో ఎమ్మెల్యే చిచ్చు రేపుతున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్సీ జంగా మండిపడ్డారు. దొరలా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జంగా కృష్ణమూర్తి గురజాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.. కొన్నాళ్లుగా మహేశ్‌రెడ్డిని టార్గెట్ చేశారు.