కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ బరి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నట్లు పార్టీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారు. ఇక ఆ స్థానంలో సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి ఉంచాలని హస్తం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 77 ఏళ్ల సోనియా గాంధీ.. వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొనే పరిస్థితి లేని కారణంగానే ఆమెను రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక 2019 జనవరిలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ వాద్రా.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ప్రచార బాధ్యతలకే పరిమితమయ్యారు.
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ.. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్‌ప్రదేశ్ ఇంఛార్జ్‌గా నియమించారు. ఈ క్రమంలోనే రాయ్‌బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోనుండటంతో తమకు కంచుకోటగా ఉన్న స్థానాన్ని ఆమెకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం అయింది. దీంతో 2024 ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న సైయర్ నసీర్ హుస్సేన్‌కు కు తిరిగి టిక్కెట్ ఇస్తారని.. అజయ్ మాకెన్‌కు కూడా రాజ్యసభకు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తోంది. అయితే ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
జనవరి 29 వ తేదీన రాజ్యసభ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27 వ తేదీన పోలింగ్ నిర్వహించి.. అదే రోజు లెక్కింపు చేపట్టనున్నారు. దీనికి ఈ నెల 15 వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. ఆ తర్వాతి రోజు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 20 వ తేదీ కాగా.. ఈ నెల 27 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు.