ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లతో రైతుల అడ్డగింత

national |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 10:44 PM

తమ డిమాండ్ల సాధన కోసం పలు రాష్ట్రాల రైతులు తలపెట్టిన మెగా మార్చ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన అన్నదాతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ సరిహద్దులు దాటాలని భావించిన రైతులపైకి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు వారిపై వాటర్ క్యానన్ల ప్రయోగం కూడా చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయల్దేరగా.. సంగ్రూర్‌ నుంచి కూడా మరో బృందం మార్చ్ ప్రారంభించింది.


ఈ క్రమంలోనే బాష్పవాయువు ప్రయోగించడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో అలుముకుంది. అంతటితో ఆగని భద్రతా బలగాలు డ్రోన్లతో స్మోక్ బాంబులను రైతులపైకి జారవిడిచారు. దీంతో అక్కడ ఆందోళన చేస్తున్న రైతులతోపాటు ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులు తీవ్ర భయాందోళనకు గురై.. పరిగెత్తారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే శంభూ సరిహద్దుల్లో 10 వేల మందికిపైగా రైతులు గుమిగూడినట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ వెల్లడించింది. ఇక అందులో బారికేడ్లను తొలగించిన కొందరు అన్నదాతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీలోకి వెళ్తుండగా.. ఢిల్లీలోకి ట్రాక్టర్‌లకు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో శంభు సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. పోలీసులు అడ్డుకోవడంతో వారి పైకి రైతులు రాళ్లు రువ్వగా.. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ కారణంగా రైతులు ఒకదశలో వెనక్కి తగ్గగా.. తర్వాత పొగ తగ్గడంతో వేలాది మంది రైతులు ముందుకు దూసుకురావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.


ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఢిల్లీ ఛలో మెగా మార్చ్‌ను ప్రారంభించిన రైతులు.. పంజాబ్‌ - హర్యానా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దాదాపు 200 రైతు సంఘాలకు చెందిన సుమారు లక్ష మంది రైతులు హర్యానా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ శంభు సరిహద్దు ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కొందరు రైతులు ఈ భాష్ప వాయువు, వాటర్ క్యానన్లను తట్టుకుని ముందుకు కదిలారు. కాంక్రీట్ దిమ్మెలను దాటి బారికేడ్లను పక్కకు జరిపేందుకు ప్రయత్నించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక మరో వీడియోలో పోలీసులపైకి రైతులు రాళ్లు విసిరినట్లు కనిపిస్తోంది. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో నెలరోజులపాటు పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు.. ఢిల్లీ సరిహద్దుల్లో 2 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలీసులతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ బెటాలియన్‌లకు చెందిన సిబ్బంది విధుల్లో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com