స్థానికుడైన అభ్యర్దిని ఎన్నుకుంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాడని, హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లే వ్యక్తి ప్రజల బాగోగులు ఎంతమాత్రం పట్టించుకోడని, స్థానికుడైన వైయస్ఆర్‌సీపీ అభ్యర్దిని ప్రజల ఆశీర్వదించాలని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు. 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉండే స్థానికుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలో 6 నెలలకు గాని ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థానికేతరుడు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాలకు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఎమ్యెల్యేగా బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కావాలో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావాలో కూడా నిర్ణయించుకోవాలని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ..ఇక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది.. ఇదే రకమైన పండగ వాతావరణం 5 సంవత్సరాల పాటు కొనసాగాలని అన్నారు. ఇది వైయస్ఆర్‌సీపీ కార్యాలయం మాత్రమే కాదని, వైయస్ఆర్‌సీపీ సేవా సదన్ అని, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొనే సమస్యలు త్వరతగతిన పరిష్కరించే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యాలయం కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రారంభించింది కాదని, ఆ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా సేవలందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలంటే ప్రజాసదన్ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య రహదారి సమస్య అని రానున్న 20-25 రోజుల్లో రోడ్లు మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే కాలువలు కూడా మరమ్మత్తు చేస్తామని చెప్పారు. పార్టీ అభ్యర్థి ప్రకటనలో అనిశ్చితి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, పార్టీలో అభ్యర్ధీ విషయంలో అనిశ్చితికి తావులేదని, ఒక వారం రోజుల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన చేనేత కులానికి చెందిన వ్యక్తి పార్టీ అభ్యర్థిగా ఉంటారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ దృష్టిలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సుఖసంతోషాలే ప్రాధాన్యతగా వైయస్ఆర్‌సీపీ పని చేస్తుందని అన్నారు.