గుంటూరులో ఓ వ్యక్తి సెల్ టవరెక్కాడు.. కొద్దిసేపు పోలీసులు, స్థానికుల్ని పరుగులు పెట్టించాడు. అతడు సెల్ టవరెక్కడానికి కారణం తెలిసి అందరూ అవాక్కయ్యారు. గుంటూరు శ్రీనగర్ ప్రాంతంలోని శారదాకాలనీ 16వ లైనులో అద్దెకు ఉంటున్న తెలగా కోటేశ్వరరావు అదే వీధిలో ఇంటిని నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి నుంచి నిర్మాణం చేస్తున్న ఇంటి వద్దకు నీటిని పైపుల ద్వారా చేరవేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్మించుకుంటున్న ఇంటి వద్ద కుళాయి కనెక్షన్ కావాలని ఇటీవల సచివాలయానికి వెళ్లగా అక్కడ సిబ్బంది అందుబాటులో లేరు.
అతడు శుక్రవారం ఉదయం శ్రీనగర్ 7వ లైను సమీపంలో సెల్ టవర్ ఎక్కేశాడు. టవర్ ఎక్కిన వారెవరు, ఎందుకు ఎక్కారనే విషయాలు తెలియలేదు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో నగరపాలక సంస్థ ఈఈ కోటేశ్వరరావు, అరండల్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. సమస్య ఏంటని అడిగి తెలుసుకున్నారు.. నీళ్ల కుళాయి కోసం టవర్ ఎక్కాలా అని ఆశ్చర్యపోయారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. అతడు కిందకు దిగి వచ్చాడు. కుళాయి కనెక్షన్ విషయంలో తాము అధికారులతో మాట్లాడతామని చెప్పి పోలీసులు ఆయన్ను అరండల్‌పేట స్టేషన్‌కు తరలించారు.
కుళాయి కనెక్షన్ విషయంలో కోటేశ్వరరావు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలపటంపై నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పందించారు. ఈఈ కోటేశ్వరరావు శారదాకాలనీ 16వ లైనుకు వెళ్లి ఆరా తీశారు. ఇల్లు నిర్మాణంలో ఉన్నందున కుళాయి కనెక్షన్ ఇవ్వలేమని, నిర్మాణం పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని నగర కమిషనర్ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు.