వెల్లుల్లి ధరలకు రోజు రోజుకూ రెక్కలు వస్తుండటంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అయితే కొనడానికి అందుబాటు ధరలో లేదని వినియోగదారులు వాపోతుంటో ఆ వెల్లుల్లి పండించే రైతులకు మరో కష్టం వచ్చి పడింది. వెల్లుల్లి ధరలు పెరగడంతో దొంగలు తమ పంట పొలాల్లోకి దూరి.. వెల్లుల్లిని ఎత్తుకెళ్లిపోతున్నారని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్లుల్లి ధరలు పెరిగినందుకు సంతోషించాలో లేక.. దొంగల భయం పట్టుకుందని భయపడాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే తమ పంట పొలాల్లో సీసీటీవీ కెమెరాలను బిగిస్తున్నారు. అవి ఉంటే దొంగలు తమ వెల్లుల్లి పంటను ఎత్తుకెళ్లరని భావిస్తున్నారు.
అయితే సాధారణంగా ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. తాజాగా వెల్లుల్లి ధరలు భారీగా ఎగబాకడంతో ఏకంగా పంట పొలాల్లో కూడా ఈ సీసీటీవీలు కనిపిస్తున్నాయి. అయితే గతేడాది టమాటాల ధరలు భారీగా పెరిగినపుడు రైతులు వినూత్నంగా ఆలోచించి.. ఈ సీసీటీవీలను పొలాల్లో అమర్చుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో ధర రూ.500 దాటిపోవడంతో రైతులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని దాదాపు 5, 6 గ్రామాల పొలాల్లో నుంచి గత కొన్ని రోజులుగా వెల్లుల్లి పంట చోరీ అవుతోంది. దీంతో తమకు నష్టం వస్తుందని భావించిన రైతులు సీసీటీవీలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యారు.
అయితే సీసీటీవీలు పొలాల్లో పెట్టిన తర్వాత వెల్లుల్లి చోరీ ఘటనలు ఆగిపోయాయని స్థానిక రైతు రాహుల్ దేశ్‌ముఖ్ వెల్లడించాడు. సోలార్ ఎనర్జీతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను తమ పొలాల్లో అమర్చుకున్నట్లు వివరించాడు. పొలంలో ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సీసీటీవీలు గుర్తించి.. ఆ తర్వాత అలారం మోగుతుందని మరో రైతు తెలిపాడు. అయితే వెల్లుల్లి ధరలు పెరగడంతో తమకు పంట పెట్టుబడితో పాటు భారీగా లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వెల్లుల్లిని సాగు చేస్తున్నా.. అంతగా లాభాలు రాలేదని పేర్కొన్నారు.