ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి-ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో ఈ వివాహం జరిగింది. 16వ తేదీన సంగీత్, మెహందీ వేడుక నిర్వహించగా.. 17న సాయంత్రం 5.30 గంటలకు వివాహం జరిగింది. 18వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త దంపతులు షర్మిలను హత్తుకున్న ఫొటో ఆకట్టుకుంటోంది.
అయితే షర్మిల కుమారుడి వివాహ వేడుకకు ఆమె సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ దూరంగా ఉన్నారు. జనవరి 17న హైదరాబాద్‌లో జరిగిన తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా జగన్ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే ఆ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఫొటో దిగాలని జగన్ భావించారు. షర్మిల మాత్రం జగన్‌తో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపలేదు. జగన్ పదే పదే కోరడం, విజయమ్మ కూడా రమ్మని చెప్పడంతో.. అతి కష్టం మీద షర్మిల ఫొటో దిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జవనరి 21 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. తన సోదరుడు జగన్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. మొదట్లో ఆమె ‘జగన్ రెడ్డి’ అంటూ వైఎస్సార్సీపీ అధినేతను సంబోధించారు. అలా మాట్లాడటాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టారు. దీంతో అయితే ఇక నుంచి జగనన్న అనే అంటానని షర్మిల చెప్పారు. సంబోధించే తీరు మారినప్పటికీ.. షర్మిల విమర్శల్లో పదును పెరిగే తప్పితే తగ్గలేదు. దీంతో జగన్ కూడా ఓ సభలో పరోక్షంగా షర్మిలను విమర్శించారు.
షర్మిల తనపై విమర్శల దాడిని పెంచడం.. మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతుండటంతో.. జగన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సిద్ధం పేరిట సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన మేనల్లుడి వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్‌లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్‌కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రిసెప్షన్‌కు కూడా జగన్ హాజరు కాలేకపోతే.. అన్నా చెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగిందని భావించాల్సి ఉంటుందేమో.