త్వరలోనే బీజేపీ - టీడీపీ - జనసేన పొత్తులపై బీజేపీ అధిష్ఠానం కీలక ప్రకటన చేస్తుందని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సీట్ల సర్దుబాటు కూడా మూడు పార్టీల నాయకత్వం కూర్చోని సెటిల్ చేస్తుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐదేళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఏపీలో రావణ రాజ్య పాలన జరుగుతోందని వైసీపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకే రెండురోజుల పాటు ఢిల్లీలో జాతీయ సమ్మేళనం జరిగిందని తెలిపారు. జగన్ ఆడని అబద్ధం, చేయని తప్పు లేదని ఆరోపించారు. ప్రతిపక్షాలనే కాకుండా, పత్రికలను, కులాలను సైతం తిడుతున్నారని విరుచుకుపడ్డారు. పోలవరానికి పొగబెట్టారని అన్నారు. అమరావతిపై మడమ తిప్పారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకుండా డాక్టర్లను, ఆస్పత్రులను ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో ఏ ఒక్కరూ వైద్యం చేయించుకోకూడదనేలా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీలో రోగులంతా చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. విద్య వ్యవస్థను సర్వనాశనం చేసి, 6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లేలా చేశారని విమర్శించారు. జగన్ పాలనలో కుదేలుకానీ రంగం అంటూ ఏదిలేదన్నారు. నిరుద్యోగులను మోసం చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. రూ.11 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పుచేరిందని తెలిపారు. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పెట్టిన బడ్జెట్ అబద్ధాలమయంగా ఉందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.