దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం అమలు జరుగుతుంది. వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా దాదాపుగా 10,132 మంది జంటలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది అని సీఎం జగన్ తెలిపారు. అయన మాట్లాడుతూ.... చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ వధువుకు, వరుడికి ఉండాలని ఈ పథకంలో నిబంధన పెట్టాం. దీని వల్ల కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. వయస్సు పరిమితి వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు మరో నిబంధన పెట్టాం. పదో తరగతి ఉత్తీర్ణత సాధించినా, వయస్సు నిండకుండా పెళ్లి చేసుకుంటే ఈ పథకం వర్తించదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం ఇంటర్మీడియట్ చదివితే అమ్మ ఒడి పథకం ఇస్తుంది. పది పూర్తయిన వెంటనే ఇంటర్మీడియట్ చదువులకు వెళ్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నాం కాబట్టి డిగ్రీ వరకు వెళ్లారు. డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి చదువులు చదివే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేలు ఇస్తున్నాం కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయిస్తున్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు చదివి ఉంటే తరువాత తరం కూడా ఆటోమెటిక్‌గా చదువుల బాట పడతారు. మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలంటే మంచి చదువులు మనకు ఉంటే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో నామ్‌కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామనే పరిస్థితి కాకుండా ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే నూతన జంటల కుటుంబానికి నగదు సాయం విడుదల చేస్తున్నాం. ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లే అవకాశం లేకుండా నేరుగా మన గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేలా మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా అప్లయ్ చేసుకునే వెసులుబాటు కల్పించాం అని తెలిపారు.