విశాఖవాసులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్బీఐని నగరంలో ఏర్పాటు చేయబోతోంది. విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని అక్కడి జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఇటీవల లేఖ రాశారు. తాగునీరు, మరుగుదొడ్లు, రెండు లిప్టులు, విద్యుత్తు కనెక్షన్, అంతర్గత పార్కింగ్, ఇంటర్నెట్, కౌంటర్లు వంటి వసతులతో ఐదేళ్ల కాలానికి అద్దె ప్రాతిపదికన ఎంపిక చేయాలని అందులో సూచించారు. విశాఖలో అనువైన భవనాలను గుర్తించి తెలియజేస్తే.. తమ బృందం పరిశీలిస్తుందని ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్ రాసిన లేఖను ప్రస్తావించారు.
కార్యాలయ నిర్మాణానికి ఏపీఐఐసీకి చెందిన స్థలం సిద్ధంగా ఉందని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. అయితే వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి నిర్మాణం పూర్తయిన భవనమైతే అనుకూలంగా ఉంటుందని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. దీంతో భవనాల పరిశీలనలో కొందరు ఉద్యోగులు నిమగ్నమైనట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. తాము అనుకున్న విధంగా భవనం లభిస్తే నెల వ్యవధిలోపే కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆర్‌బీఐ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా 2022 ఆగస్టు 22 నుంచి ఆంధ్రప్రదేశ్ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తోంది. 2016లోనే గత ప్రభుత్వం అమరావతిలో భారతీయ రిజర్వు బ్యాంకు కార్యాలయం, నివాస సముదాయాల ఏర్పాటుకు 11 ఎకరాల భూముల్ని కేటాయించింది. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటే ఆర్‌బీఐకి కూడా అప్పట్లో నిర్ణీత ధరపై 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో భూమి వ్యవహారంపై ఎటూ తేల్చలేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా.. ఇప్పటికీ నాబార్డు, ఆర్‌బీఐ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది.