సుప్రీంకోర్టుకు మన దేశంలో ఎంతో విశిష్ఠత ఉంటుంది. సామాన్య పౌరులకు న్యాయం అందించే చివరి వేదిక సుప్రీంకోర్టు. చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో సంచలన తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. అయితే తాజాగా మరో ఘటనతో సుప్రీంకోర్టు వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి కోర్టు ఆవరణలో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. అంతే కాకుండా ఆ ఎన్నికలో గెలిచిన వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజేతగా ప్రకటించడం మరో విశేషం. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కౌంటింగ్ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగింది. గతంలో చండీగఢ్‌లో నిర్వహించిన మేయర్ ఎన్నిక కౌంటింగ్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్న సుప్రీంకోర్టు.. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే చెల్లుబాటు కావని అనిల్ మాసిహ్ పక్కన పెట్టిన 8 బ్యాలెట్ పేపర్లను కూడా కలిపి లెక్కించాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఆ బ్యాలెట్ పత్రాలను పరిశీలించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనే చండీగఢ్ మేయర్ ఎన్నిక కౌంటింగ్ నిర్వహించారు.
ఈ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అయిన కుల్దీప్ కుమార్‌కు ఎక్కువ ఓట్లు రాగా.. ఆయననే చండీగఢ్ మేయర్‌గా జడ్జీలు ప్రకటించారు. దీంతో దశాబ్దాల సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ఎన్నికల కౌంటింగ్ కోర్టులో జరగ్గా.. ఫలితాలను న్యాయమూర్తులు ప్రకటించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షంలో ఈ కౌంటింగ్ జరిగింది.
అయితే దీనిపై కొత్తగా ఎన్నిక పెట్టాలని బీజేపీ చేసిన అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఆప్-కాంగ్రెస్ కూటమి మేయర్ అభ్యర్థికి పడిన 8 ఓట్లను ఉద్దేశపూర్వకంగానే రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసిహ్ కొట్టివేసి చెల్లనివిగా ప్రకటించారని సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే అలా బ్యాలెట్ పేపర్లను కొట్టివేస్తూ.. అనిల్ మాసిహ్ సీసీటీవీ ఫుటేజీకి చిక్కడం గమనార్హం. ఈ క్రమంలోనే రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన పని పట్ల సీరియస్ అయిన సుప్రీంకోర్టు.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అనిల్ మాసిహ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తెలిపింది.
ప్రజాస్వామ్య ప్రక్రియను ఇలాంటి కుట్రల ద్వారా నిర్వీర్యం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇందులో భాగంగానే ప్రజాస్వామ్య ప్రాథమిక నియమాలను కాపాడేందుకు ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్పక జోక్యం చేసుకోవాలని కోర్టు భావిస్తోందని పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జనవరి 30 వ తేదీన చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఫలితాలు రద్దు అయ్యాయి. అప్పుడు అత్యధిక కౌన్సిలర్ల మద్దతు ఉన్న ఆప్-కాంగ్రెస్ అభ్యర్థిని కాదని.. బీజేపీ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటించారని కోర్టు తేల్చింది.