ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాల్గొనాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలతో సహా గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెబుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో వలంటీర్ల ప్రమేయం లేకుండా సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఎన్నికల కమిషన్ వెంటనే ఆదేశాలివ్వాలని కోరారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.