వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడులో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఒక ప్రకటనలో కోరారు. టీడీపీ- జనసేన పార్టీల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండటాన్ని జీర్ణించుకోలేక మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రెండు పార్టీలు చేతులు కలిపాయన్నారు. ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుని ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారని చెప్పారు. వైసీపీ పాలన నియంతృత్వ పాలనగా అభివర్ణించారు. మీడియాపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటుకు టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తాడేపల్లిగూడెంకి తరలివెళ్లాలని సూచించారు. జనసేన జాయింట్ సెక్రటరీ చిమట రవివర్మ కూడా ఒక ప్రకటనలో బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.