చిత్తూరు జిల్లాలో కలకలంరేపిన నకిలీ గ్రూప్-2 టికెట్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బంధువు అని నమ్మితే.. ఆ తప్పుతో పాపం అమాయకుడు బలయ్యాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన సుదర్శన్ గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసి పెట్టమని డోన్‌లో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న తన సమీప బంధువైన ఇమ్మానుయేల్‌కు చెప్పాడు. డబ్బులు ఇచ్చి వివరాలు చెప్పి, దరఖాస్తు చేసి హాల్‌టికెట్ వచ్చాక పంపమని వెళ్లిపోయాడు. ఇమ్మానుయేల్ దరఖాస్తు చేయకుండా టైం వేస్ట్ చేశాడు.
గ్రూప్-2 పరీక్షకు తేదీ సమీపించడంతో సుదర్శన్ ఇమ్మానుయేల్‌ను హాల్‌టికెట్ గురించి అడిగాడు. దరఖాస్తు పెట్టలేదని చెబితే గొడవవుతుందని భయపడ్డ ఇమ్మానుయేల్ నకిలీ హాల్‌టికెట్ తయారీకి సిద్ధపడ్డాడు. పరీక్ష కేంద్రం దూర ప్రాంతంలో పడినట్లు పెడితే.. సుదర్శన్ అక్కడకు వెళ్లలేడు కనుక సమస్య ఉండదని భావించాడు. అదే సమయంలో ఓ యువకుడు తన మీ-సేవ కేంద్రంలో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని వెళ్లగా.. దాని కాపీ దాచిపెట్టి సుదర్శన్ వివరాలతో ‘ఎడిట్’ చేశాడు.
గ్రూప్-2 పరీక్ష కేంద్రం కర్నూలుకు దూరంగా ఉండే చిత్తూరుగా మార్చి, హాల్ టికెట్ తయారుచేసి సుదర్శన్‌కు ఇచ్చాడు. అతడు ఆదివారం హడావిడిగా చిత్తూరు చేరుకుని పరీక్ష కేంద్రం కోసం అధికారులను ఆశ్రయించగా హాల్‌టికెట్ నకిలీదని గుర్తించి పోలీసులకు తెలిపారు. వారు అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడు సుదర్శన్ చెప్పిన వివరాలతో ఇమ్మానుయేల్ నిర్వాకాన్ని గుర్తించి అరెస్టు చేశారు. అతడి దగ్గర ఉన్న కంప్యూటర్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. గతంలో తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైషమ్యాలను మనసులో పెట్టుకుని ఇమ్మానుయేలు ఇలా చేశాడనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.