బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ప్రస్తుతం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను ఛేధించేందుకు పోలీసులు, దర్యాప్తు సంస్థలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడిని ఇప్పటికే సీసీటీవీల ద్వారా గుర్తించిన పోలీసులు.. అతడి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారింది. ఆ బాంబు పెట్టి వెళ్లిన వ్యక్తి ముఖాన్ని స్పష్టంగా గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో దాని యజమానులు స్పందించారు.కేఫ్‌లో పేలుడుకు పాల్పడిన నిందితుడు సీసీటీవీ కెమెరాల్లో చిక్కారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై రామేశ్వరం కేఫ్ ఓనర్లు రాఘవేంద్రరావు, దివ్య రాఘవేంద్రరావు. ఈ ఘటన జరిగిన తర్వాత దివ్య రాఘవేంద్రరావు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పేలుడు ఘటన జరిగిన సమయంలో తన వద్ద తన సెల్‌ఫోన్ లేదని.. ఆ తర్వాత వచ్చి చూసేసరికి చాలా మిస్ కాల్స్ ఉన్నాయని తెలిపారు. వెంటనే రామేశ్వరం కేఫ్ సిబ్బందికి ఫోన్ చేయగా.. జరిగిన విషయాన్ని వారు వివరించారని వెల్లడించారు. పేలుడు జరగ్గానే కిచెన్‌లో ఏదో పేలిందని తాము మొదట అనుకున్నామని.. కానీ కిచెన్ సిబ్బంది ఎవరూ గాయపడలేదని.. అక్కడ ఎలాంటి రక్తం, గాయాలు లేకపోవడంతో కేఫ్ లోపల పేలుడు జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు.
ఆ తర్వాత కేఫ్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ అనుమానితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాడని దివ్య రాఘవేంద్రరావు వివరించారు. ఆ వ్యక్తి ఆర్డర్ తీసుకున్న తర్వాత కేఫ్‌లోని ఒక మూలకు కూర్చున్నాడని.. ఆ రవ్వ ఇడ్లీని తిన్న తర్వాత రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లేముందు తాను తీసుకువచ్చిన బ్యాగును ఆ మూలకు పెట్టి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఆ వ్యక్తి కేఫ్ నుంచి బయటికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత పేలుడు సంభవించిందని చెప్పారు. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన ప్రదేశంలో గ్యాస్ సిలిండర్లు లేవని తెలిపారు.
ఇక తాను ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చానని దివ్య రాఘవేంద్రరావు వెల్లడించారు. రామేశ్వరం కేఫ్‌ను కూడా తమ బిడ్డ లాగే చూసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. తన బిడ్డకు, రామేశ్వరం కేఫ్‌కు ఎలాంటి తేడా లేదని తెలిపారు. తన రామేశ్వరం కేఫ్‌కు జరిగిన నష్టం తమను చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా రామేశ్వర కేఫ్ కస్టమర్లకు ఆమె హామీ ఇచ్చారు. అతి తొందర్లోనే రామేశ్వరం కేఫ్ బలంగా తిరిగి వస్తుందని పేర్కొన్నారు. అప్పుడు రామేశ్వరం కేఫ్ మరింత పటిష్ఠమైన భద్రత, ఇతర సెక్యూరిటీ సిస్టమ్‌లతో పనిచేస్తుందని దివ్య రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో గాయపడిన వారికి సహాయం చేస్తామని దివ్య రాఘవేంద్రరావు హామీ ఇచ్చారు. కేఫ్‌లో సంభవించిన పేలుడు తక్కువ తీవ్రత కలిగిందని.. అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. అందుకు దేవుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరికీ తీవ్రమైన గాయాలేమీ కాలేదని.. వారు 15 నుంచి 30 రోజుల్లో కోలుకుంటారని వెల్లడించారు. కేఫ్ పేలుడులో గాయపడిన వారికి తాము సాయం చేస్తామని చెప్పారు. మరోవైపు.. ప్రస్తుతం జరుగుతున్న బాంబు పేలుడుకు సంబంధించి అధికారులకు దర్యాప్తు కోసం పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.