భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన వారికి, ఆ ఉగ్రదాడులకు కుట్రలు పన్నిన వారికి పాకిస్థాన్ స్వర్గధామం అని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్థాన్‌లో ఉంటాయి. పాకిస్థాన్ గడ్డపై నుంచి ప్రపంచ దేశాల్లో ఉగ్రదాడులకు ఆదేశాలు వెళ్తాయి. ఇతర దేశాల్లో దాడులు చేసి.. దర్జాగా పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందున్న ఉగ్రవాదులు చాలా మందే ఉన్నారు. భారత్‌లో కూడా జరిగిన ఎన్నో ఉగ్రదాడులు పాక్ ప్రేరేపితం అని తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల ముఖ్య నేతలు హతం కావడం చూస్తూనే ఉన్నాం. 26/11 ముంబై పేలుళ్లకు కీలక సూత్రధారి తాజాగా పాకిస్థాన్‌లో చనిపోయాడు.
దాదాపు 16 ఏళ్ల క్రితం ముంబైలో మారణహోమానికి కుట్ర పన్నిన లష్కరే తోయిబా కీలక సూత్రధారి అజామ్ ఛీమా గుండెపోటుతో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అయిన అజామ్ ఛీమా హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ నగరంలో అజామ్ ఛీమా ప్రాణాలు కోల్పోయినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అజామ్ ఛీమా మృతదేహానికి మల్కాన్‌వాలాలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు 2008 నవంబరు 26 వ తేదీన ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొలాబా సముద్ర తీరం నుంచి ముంబైలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. టీమ్‌లుగా విడిపోయి ముంబైలో రద్దీగా ఉండే ప్రముఖ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణ హోమం దాదాపు 60 గంటల పాటు సాగింది. ఆ ఘోర ఘటనలో భారత్‌తోపాటు విదేశీయులు కలిపి మొత్తం 166 మంది ప్రజలు చనిపోయారు. చనిపోయిన వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. అజామ్ ఛీమా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడని అమెరికా నిఘా వర్గాలు గుర్తించగా.. అతడి పేరును మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది.
అజామ్ ఛీమా కేవలం 26/11 ముంబై పేలుళ్లు మాత్రమే కాకుండా దేశంలోని ఇతర బాంబు పేలుళ్లకు కూడా కీలక సూత్రధారిగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2006 లో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక కూడా అజామ్ ఛీమా హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆ దుర్ఘటనలో 188 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 800 ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక 2008 ముంబై దాడులు మాత్రం భారత దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.