స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువుల ఇళ్లల్లో, కార్యాలయాలపై సీఐడీ అధికారులు చేసిన రైడ్స్ జగన్ రెడ్డి కక్షసాధింపుల్లో భాగమేనని చెప్పారు. ప్రభుత్వ పరిధిలోకి రాని విషయాలను పట్టుకొని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌పై అక్రమ కేసులు పెట్టించి, జైలుకు పంపారని విరుచుకుపడ్డారు. కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణ సంస్థ అలెక్సా కార్పొరేషన్ రూ.8కోట్ల ట్యాక్స్ మినహాయింపులు కోరిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ డీజీజీఐ విచారణ చేపట్టిందని తెలిపారు. ఆ కంపెనీ ఎండీ జోగేశ్వరరావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారని కంపెనీ తరుపున జరిగిన వ్యవహారాలకు తానే బాధ్యుడినని ఒప్పుకున్నారని చెప్పారు. అలెక్సా సంస్థకు రాష్ట్ర సీఆర్డీఏతో ఎలాంటి సంబంధంలేదని ఆ సంస్థ అధికారులే చెప్పారని గుర్తుచేశారు.