ఏపీలో15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. తన దగ్గర సమాచారం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రజలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల దాడులను ప్రజలు తట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు తిరుమల రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఇళ్లపై పోలీసులు చాలా దాడులు చేశారని అన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలే కానీ వైసీపీ నేతలకు కొమ్ముకాసేలా ఉండకూడదని చెప్పారు. వారు ఎవరికైతే మద్దతుగా ఉంటున్నారో ఆ నేతలు రాబోయే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతారని హెచ్చరించారు. ఏపీలో త్వరగా ఎన్నికల కోడ్ వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కొందరు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు ఇప్పటికైనా ప్రజలకు రక్షణగా ఉండాలని ఎంపీ రఘురామ సూచించారు.