ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతులకిచ్చిన మరో మాటను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్.. రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించారు.ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ జంట సొరంగాలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రభావిత 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 15.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి ద్వారా సీఎం జగన్ శాశ్వత పరిషారం చూపారు.