ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నిబంధనలు పాటించాలి, రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దు.. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2024, 09:11 PM

ఏపీలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. అధికారులు కీలక సూచనలు చేశారు. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి డబ్బులు.. రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయటం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదన్నారు. పరిమితికి మించి డబ్బులు రవాణా చేస్తున్న వాహనాలను కూడా ఆ డబ్బులతో పాటుగా సీజ్‌ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ నిర్వహించారు.


కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించటం, ఓట్లు అడగటం నిషిద్ధమన్నారు. లోక్‌సభ అభ్యర్థులు రూ.95 లక్షల వరకు, శాసనసభ అభ్యర్థులు రూ.40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉందన్నారు. బహిరంగ సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల కోసమే ఈ మొత్తాన్ని వెచ్చించాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, కానుకలు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయటాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తామన్నారు. ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా, రోజువారీ ఖర్చుల రిజిస్టర్‌ నిర్వహించాలి. పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందన్నారు.


ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని గుర్తు చేశారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ.25 వేలు, శాసనసభకు పోటీ చేసేవారు రూ.10 వేలు.. నగదు రూపంలో లేదా ఆర్‌బీఐ/ ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాలని సూచించారు. చెక్కులు, బ్యాంక్‌ డ్రాఫ్టులు అనుమతించట్లేదన్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపేయాలన్నారు.


అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగుర్ని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తించాలన్నారు. షెడ్యూల్‌ విడుదలైన ఐదారు రోజుల తర్వాత నోటిఫికేషన్‌ వస్తుంది అన్నారు. కోడ్‌ అమల్లో ఉండగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్నారు. పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పరరుచుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు ముకేశ్‌కుమార్‌ మీనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com