కూటముల లెక్కలు తేలటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే అద్దంకిలోని మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభ వేదికగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ను ఉద్దేశించి అనిల్ కుమార్ యాదవ్ పరుష వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఉండి డ్రోన్ పంపించి, ఖాళీ స్థలాలను చూపి, సిద్ధం సభలకు జనం రాలేదని చెప్పడం కాదనీ.. దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"డ్రోన్‌ను పంపి, ఖాళీ స్థలాలు షూట్ చేసి జనాలు రాలేదని చెప్పడం కాదు. నీకు దమ్ముంటే, ఇక్కడకు రా. లక్షలాది మంది జనం సాక్షిగా తొక్కుతాం బిడ్డా. ఇంట్లో దాక్కుని డ్రోన్ పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడకు రా. శబ్దంతో చచ్చిపోతావ్ "అంటూ అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే అంతకుముందు సీఎం జగన్ పాల్గొనాల్సి ఉన్న సిద్ధం సభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా.. వార్ ప్రారంభమైంది. " టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎఫెక్ట్ జగన్ సభకు గట్టిగా తగిలింది. సభకు జనాలు ఎవరూ రాకపోవడంతో సభని రెండు గంటలు వాయిదా వేసుకున్నారు. గ్రాఫిక్స్‌తో కవర్ చేద్దామని గ్రీన్ మ్యాట్ వేయించారు, అయినా అరకొర జనాలూ రాలేదు. గంటన్నర సభ వాయిదా వేశారు. జగన్ పని అయిపోయింది, వైకాపా దుకాణం బంద్ అనేందుకు సాక్ష్యాలు ఇవే" అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
అయితే వైసీపీ సోషల్ మీడియా విభాగంగా కూడా దీనికి అంతే స్థాయిలో బదులిచ్చింది." గ్రాఫిక్స్ అనేది మీ ఫామిలీ విద్య కదా. మీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చూపించిందే గ్రాఫిక్స్. మాకు అవేం అక్కర్లేదు, మాకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. జగనన్న కటౌట్ చాలు, లక్షలమందిని ఉరకలెత్తిస్తుంది. అలాంటిది నేరుగా జగనన్న వస్తున్నాడు అంటే ఎలా ఉంటుందో ఊహించుకో!" అంటూ ట్వీట్ చేసింది. అయితే సిద్ధం సభకు జనం రాలేదంటూ నారా లోకేష్ ట్వీట్ చేయటంతో.. సభలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైరయ్యారు.ఎక్కడో దూరంగా ఉండి.. డ్రోన్‌ను పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా. కార్యకర్తల నినాదాలతోనే నీ షర్ట్ తడిచిపోవడం ఖాయమంటూ నారాలోకేష్‌ను ఉద్దేశించి సవాలు విసిరారు.