ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైపోయింది. నిన్న మొన్నటి దాకా కాస్త ఆచితూచి అడుగులు వేసిన పార్టీలు.. ఎవరెవరు ఎటువైపు అనే క్లారిటీ రావటంతో యుద్ధానికి సిద్ధమైపోయాయి. వైనాట్ 175 నినాదంతో సిద్ధం అంటూ దూసుకెళ్తున్న జగన్.. విపక్షాలపై మాటలయుద్ధానికి దిగారు. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలోని మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభలో పాల్గొన్న జగన్.. కూటమిగా ముందుకు వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీపై డైరెక్ట్ ఎటాక్ చేశారు. చంద్రబాబుకు నమ్మి ఓటు వేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లేనంటూ సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు పొత్తులన్నీ పార్టీలతోనేని.. తమ పొత్తు మాత్రం ప్రజలతో అని అభిప్రాయపడ్డారు.
మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న జగన్.. జనం ఆలోచించి ఓటు వేయకపోతే చంద్రముఖి మీ ఇంటికి వచ్చి లకలక అంటుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తనపై పోటీకి అరడజను పార్టీలు సిద్ధమయ్యాయని.. తాను మాత్రం సింగిల్ అని చెప్పుకొచ్చారు. " మరో నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. వీళ్లందరి పార్టీలకు సేనాధిపతులే తప్ప సైన్యం లేదు. వాళ్ల వెనుక జనం లేరు. అందుకే పొత్తులతో వస్తున్నారు. నాకు చంద్రబాబుకు ఉన్నట్లు పొలిటికల్ స్టార్స్ లేరు. పార్టీలతో పొత్తులు లేవు. ఒంటరిగా ఎన్నికలకు కెళ్తున్నా. సామాన్య ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగుతున్న యుద్ధం ఇది. ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుడి పాత్ర నాది. ఓటు అనే అస్త్రాన్ని పెత్తందార్లుపై ప్రయోగించాలి" అని జగన్ సూచించారు.
తుప్పు పట్టిన సైకిల్ తోసేందుకు ప్యాకేజీ స్టార్.
.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎలా చెప్తే ప్యాకేజీ స్టార్ అలా నటిస్తారంటూ పంచులేశారు. అలాగే పొత్తుల మీద కూడా జగన్ విమర్శలు చేశారు.
" ప్రజల ఆశీర్వాదంతోనే మన ఫ్యాన్‌కు పవర్. కానీ చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్ లేదు. చక్రాలు లేవు. తుప్పుపట్టిపోయింది. ఆ తుప్పుపట్టిన సైకిల్ తోయడానికి ఆయనకు వేరేవాళ్లు కావాలి. అందుకే ప్యాకేజీ ఇచ్చి మరీ దత్తపుత్రుణ్ని తెచ్చుకున్నాడు. ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు అడగడు, సీట్లు ఎందుకు తక్కువ ఇస్తున్నావని అడగడు. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. ఇప్పుడేమో దత్తపుత్రుడితో సహా ఢిల్లీ వెళ్లి మోకరిల్లారు. చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తకపోయి ఉంటే.. పొత్తుల కోసం ఢిల్లీ వెళ్లి ఎందుకు ఇన్ని అగచాట్లు పడతారు" అని జగన్ విమర్శించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిపై విమర్శలు
2014లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలూ కూటమిగా వచ్చినట్లు జగన్ గుర్తుచేశారు. నాటి ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను చూపిస్తూ.. వీటిలోని హామీలు అమలయ్యాయా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. నరక లోకానికి, నారా లోకానికి ఎవరూ రారన్న జగన్.. ఎంట్రన్స్‌లో స్వర్గం చూపించి, లోపలకు తీసుకెళ్లి నరకం చూపించే మార్కెటింగ్ స్ట్రాటజీ చంద్రబాబుదని విమర్శించారు . చంద్రబాబు మేనిఫెస్టోకు, శకుని పాచికలకు తేడా లేదన్న జగన్.. కిచిడీ వాగ్ధానాలతో వస్తున్న చంద్రబాబును నమ్మితే చంద్రముఖిని తెచ్చుకున్నట్లేనని అన్నారు.