టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతాను. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక అద్భుతమని కొనియాడారు. కూటమి సక్సెస్ ఫుల్‌గా పని చేస్తుందన్నారు. మూడు పార్టీల నాయకులం కలిసి పని చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేర్కొన్నారు. కాగా.. సోమవారం ఉదయం టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట అల్పాహార విందు ఇచ్చారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను ఈ విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు. ఇటీవల వైసీపీకి మాగుంట రాజీనామా చేసిన విషయం తెలిసిందే.