మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి హాజరయ్యారు. జ్యూడిషల్ రిమాండ్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. నిన్న ఏ 5 నిందితుడిగా ఉన్న దేవి రెడ్డి శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత చంచల్ గూడ జైలు నుంచి శివశంకర్ రెడ్డి విడుదల కానున్నారు. కాగా.. నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఏ6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ7 భాస్కర్ రెడ్డి తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసుపై మీడియా ట్రయల్ జరగనుందని తెలిపారు. యూట్యూబ్ లింక్స్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది కోరారు. న్యాయస్థానం కంటే ముందే మీడియా ట్రయల్ చేసి చెబుతోందన్నారు. దీని వలన కోర్ట్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది తెలిపారు. మీడియాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సీబీఐ కోర్ట్ తెలిపింది. మీడియా కథనాలతో ఎందుకు కోర్ట్ ప్రభావితమవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. మేము అప్రమత్తంగానే ఉన్నామని.. కోర్టును ఎవరూ ప్రభావితం చేయలేరని.. అనుమానం అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణ 28 కి కోర్టు వాయిదా వేసింది.