ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడంతో పాటుగా.. అవతలి పక్షాలపై విమర్శలు సంధిస్తున్నాయి. తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలకు ఉన్న ప్రధాన ఆయుధం ప్రకటనలు. ఓ వైపు మైకులతో ప్రచారం హోరెత్తిస్తూనే.. మరోవైపు పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.'ఫ్యాన్' గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను "గాజు గ్లాసు" తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ గుర్తు ఉన్న వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిందని సింబాలిక్‌గా తెలిపేలా.. ఫ్యాన్ స్విచ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి. అమరావతి, ఇసుక పాలసీ, రాష్ట్ర అభివృద్ధి ఇలా వాటిపై రాసి ఉంటుంది. అంటే వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి సహా పలు అంశాలు ఇలా దెబ్బతిన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి "ఫ్యాన్" స్విచ్ ఆఫ్ చేసి.. చెల్లాచెదురుగా పడిపోయిన పేపర్లను ఒక్కొక్కటిగా తీసి టేబుల్ మీద సర్దుతారు. ఆపై ఆ పేపర్ల మీద "గాజు గ్లాసు" ఉంచుతారు. అంటే వైఎస్ జగన్‌ను గద్దెదించి రాష్ట్రాభివృద్ధిని తాము చక్కదిద్దుతామనే విషయాన్ని పార్టీల సింబల్ ద్వారా ఇలా తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
అలాగే టేబుల్ మీద జనసేన గుర్తు అయిన గాజుగ్లాసుతో పాటుగా టీడీపీ సైకిల్. బీజేపీ కమలం గుర్తులు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక వీడియో ఆఖర్లో సీఎం కుర్చీని పట్టుకుని.. పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే.. ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామనే విషయాన్ని జనసేన ఈ యాడ్ ద్వారా తెలియజేసిందని నెటిజన్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఆఖర్లో పొత్తు గెలవాలి.. ప్రభుత్వం మారాలి అనే నినాదంతో మోదీ, పవన్, చంద్రబాబు ఫొటోల కనిపిస్తాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రిలీజైన ఈ వీడియోను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .