మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారకసభలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంతకులు ఎవరో కాదు బంధువులేనని సాక్ష్యాలు చెప్తున్నాయని షర్మిల అన్నారు. బాధితులకు అండగా భరోసా ఇవ్వకుండా వారిపైనే ఆరోపణలు చేస్తు్న్నారని అన్నారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదని షర్మిల విమర్శించారు. జగనన్న అద్దం ముందు నిల్చుని ప్రశ్నించుకోండి అంటూ సూచించారు. మనస్సాక్షి ఏం చెప్తుందో వినాలని అన్నారు. వైఎస్ఆర్ తన తోబుట్టువుల కోసం ఎంతో చేశారన్న వైఎస్ షర్మిల.. ఆయన వారసుడిగా మీరేం చేశారంటూ ప్రశ్నించారు.
మరోవైపుఎవరు అండగా నిలిచినా.. నిలవకున్నా వైఎస్ వివేకా కుమార్తె సునీతకు తాను అండగా ఉంటానని వైఎస్ షర్మిల ప్రకటించారు. తమ పోరాటం అధికారం కోసం, ఆస్తి కోసం కాదన్న షర్మిల.. న్యాయం కోసమంటూ వ్యాఖ్యానించారు.
"సునీతను చూసిన ప్రతిసారి.. నా గుండెల్లో బాధ, ఉద్రేకం. న్యాయం జరగలేదనే కోపం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదనే ఆవేదన. అందుకే సునీతకు, చిన్మమ్మకు మాటిస్తున్నా. మీ పక్కన ఎవరు నిలబడినా, నిలబడకపోయినా వైఎస్ఆర్ బిడ్డ మీకు అండగా ఉంటుంది. సునీత చేస్తున్న ధర్మపోరాటంలో నేను సునీతకు బలమైతా, ఆయుధమైతా. పుట్టిన గడ్డ సాక్షిగా చెప్తున్నా. ఎవరు నిలబడినా, నిలబడకపోయినా సునీతకు అండగా ఉంటా. వివేకాను హత్యచేసిన వారికి శిక్షపడాలని సునీత చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తా" అని షర్మిల అన్నారు
"ఇది రాజకీయాల కోసమో, వారసత్వం కోసమో, ఆస్తి కోసమో, అధికారం కోసమో చేస్తున్న పోరాటం కాదు. ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు విషయంలో న్యాయం కోరుతున్న బిడ్డ కోసం, భర్తను క్రూరాతి క్రూరంగా కోల్పోయి విధవరాలిగా మారిన ఓ భార్య కోసం. చిన్నాన్న ఆత్మ శాంతికోసం. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. అందుకే తెలుగు ప్రజలందరూ నిజం పక్కన, న్యాయం పక్కన, ధర్మం పక్కన నిలబడాలని కోరుతున్నా. హత్యారాజకీయాలను ఛీకొట్టి, హంతకులను కాపాడుతున్నవారిని కూడా గుణపాఠం నేర్పాలి. నిజం గెలవాలి" అని షర్మిల అన్నారు.