కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. అందరిని సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఏపీలో తీవ్రంగా నడిచింది. ఒకానొక సమయంలో జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.. పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళతారని చర్చ నడిచింది. అయితే పవన్ తీరు నచ్చకపోవడంతో.. పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి.. ముద్రగడ జనసేన పార్టీలోకి వెళ్లడం లేదని సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే వైఎస్సార్‌సీపీ పద్మనాభంతో టచ్‌లోకి వెళ్లింది. వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లా నేతలతో కలిసి ముద్రగడ పద్మనాభాన్ని కలిసి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన వైఎస్సార్‌సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 14న తాడేపల్లికి ర్యాలీగా వెళ్లి వైఎస్సార్‌సీపీలో చేరాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇవాళ ఎలాంటి హడావిడి లేకుండా వెళ్లి పార్టీలో చేరారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం 1978లో జనతా పార్టీతో మొదలైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు.