అమ్మానాన్నల తర్వాత మనల్ని అంతగా కట్టిపడేసే బాంధవ్యాలు నాన్నమ్మ, తాతయ్యలు. చిన్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు వినిపించడం దగ్గర నుంచి.. చేయిపట్టుకుని స్కూలు నడిపించేదాకా ప్రతి ఒక్కరికీ వారి తాతయ్య, నాన్నమ్మలతో అనుబంధం ఉంటుంది. అయితే అలా చిన్నప్పటి నుంచి తనను పెంచిన నాన్మమ్మ పట్ల ఓ మనవడు కర్కశత్వం ప్రదర్శించాడు. చెడు అలవాట్లకు బానిసైన ఆ మనవడు.. తన జల్సాల కోసం డబ్బు అవసరమై సొంత నాన్నమ్మనే కడతేర్చాడు. ఆపై ఇంట్లో ఉన్న బంగారాన్ని చోరీ చేసి.. ఏమీ ఎరగనట్లు నటించాడు. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో చోటు చేసుకుంది.
గోనెగండ్ల మండలం పెద్దమరమీడులో నాగమ్మ అనే మహిళ మనవడితో కలిసి ఉంటోంది. నాగమ్మ కొడుకు, కోడలు బతుకుదెరువు కోసం వేరే ఊరికి వలస వెళ్లారు. ఇంటి దగ్గర నాగమ్మ మనవడితో కలిసి ఉంటోంది. అయితే చెడు అలవాట్లకు బానిసైన వెంకటేష్‌కు డబ్బు అవసరమైంది. దీంతో నాగమ్మ వద్ద ఉన్న బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా తన వద్దనున్న బంగారాన్ని కాజేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరకూ లేకపోవటంతో నాన్నమ్మను దారుణంగా హత్య చేశాడు. మార్చి5 వ తేదీన నాగమ్మ ను చంపి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టి.. బంగారం కాజేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే మార్చి 13వ తేదీ ఇంటికి వచ్చిన నాగమ్మ కుమారుడు.. ఇంట్లో తల్లి కనపడక పోవటంతో ఆందోళన చెందాడు. చుట్టుపక్కల వారిని విచారించాడు. అప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవటంతో చివరకు గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నాగమ్మ కొడుకు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మనవడు వెంకటేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చి.. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో బంగారం కోసం నాన్నమ్మను తానే చంపినట్లు వెంకటేష్ అంగీకరించాడు. దీంతో వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.