ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.. షెడ్యూల్ రాకముందే పార్టీలన్నీ కసరత్తులు మొదలు పెట్టాయి. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. టీడీపీ తొలి విడతలో 94.. రెండో జాబితాలో 34 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే నెల్లూరు జిల్లాలో ఈసారి భార్యాభర్తలకు టికెట్లు కేటాయించింది టీడీపీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున భార్యాభర్తలు పోటీలో నిలవనున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది.. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు.. అధికార ప్రకటన లాంఛనమే
అయితే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. అదే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి ఎంపిక చేశారు. టీడీపీలో తొలిసారిగా భార్యాభర్తలకు లోక్‌సభ, శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఆయన భార్య సీతా దయాకర్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీచేసి గెలిచారు. ఈసారి వేమిరెడ్డి దంపతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
మరోవైపు ఈసారి టీడీపీలో సీనియర్ నేతలు వారి వారసుల్ని బరిలోకి దింపారు.. పలువురి నేతల భార్యలకు టికెట్లు ఇచ్చారు. టీడీపీ తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో ఏడుగురు వారసులకు, వారి కుటుంబాల్లో వారికి చోటు దక్కింది. రాజకీయ కుటుంబాలకు చెందిన వీరు.. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నుంచి వరుపుల రాజా భార్య సత్యప్రభ పోటీ చేయనున్నారు. రాజా ఇటీవల గుండెపోటుతో మరణించారు. అందుకే రాజా సతీమణి సత్యప్రభాకు అవకాశం దక్కింది.
తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియకు అవకాశం దక్కింది. పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ కోడలు అయిన ఆమె.. తొలిసారిగా పోటీచేయబోతున్నారు. కడప జిల్లా కమలాపురం నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి కుమారుడు కృష్ణ చైతన్యరెడ్డికి అవకాశం కల్పించారు. యువతకు అవకాశం కల్పించాలన్న లోకేష్ ఆలోచనలో భాగంగా ఆయనకు చోటు దక్కింది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి బరిలో నిలవనున్నారు. గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మను పోటీ చేయించాలని ఒక దశలో ఆలోచించినా.. చివరకు సుధీర్‌రెడ్డివైపే టీడీపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. పుట్టపర్తి శాసనసభా స్థానం నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి వారసురాలిగా.. ఆయన కోడలు సింధూరరెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా తొలిసారి శాసనసభ బరిలో నిలవనున్నారు. కదిరి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కందికుంట యశోదాదేవి.. మాజీ ఎమ్మెల్యే కందికుంట శివప్రసాద్ భార్య. ఆమె కూడా మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.