చంద్రబాబు రాజకీయం పనిచేసింది. పిఠాపురం తెలుగు తమ్ముళ్లలో చెలరేగిన అసంతృప్తి సద్దుమణిగింది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించగానే.. పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి భగ్గుమంది. రోడ్లపైకి చేరిన కార్యకర్తలు.. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మకు టికెట్ కేటాయించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఏకంగా టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు తలనొప్పులు తప్పవా అనే డౌటనుమానాలు వ్యక్తమయ్యాయి. పిఠాపురంలో వర్మవర్గం రెబల్‌గా మారితే పవన్‌కు ఇబ్బందేనంటూ వార్తలు వచ్చాయి.
గతంలోనూ ఓసారి టీడీపీ టికెట్ నిరాకరించడంతో వర్మకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అనుభవం ఉంది. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి గెలుపొందిన రికార్డు వర్మ సొంతం. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మ సహకరించకపోతే.. పవన్ కళ్యాణ్‌కు విజయం అంత సులభం కాదనే వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు రాజకీయం పవన్ కళ్యాణ్ ఇబ్బందులను దూరం చేసింది. చంద్రబాబు మాటలతో వర్మ మెత్తబడ్డారు. ఎమ్మెల్సీ ఇస్తామన్న చంద్రబాబు ప్రకటనతో ఎస్వీఎస్ఎన్ వర్మ చల్లబడ్డారు.
అసంతృప్తితో ఉన్న వర్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని, పవన్ కళ్యాణ్‌కు సహకరించాలని సూచించారు. అయితే స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించమని వర్మ అనుచరులు పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మను బుజ్జగించిన చంద్రబాబు.. ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యీ ఇవ్వటంతో పాటు క్యాబినెట్ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల సమక్షంలోనే చంద్రబాబు నుంచి ఈ ప్రకటన రావటంతో వర్మ సైతం మెత్తబడ్డారు.
మరోవైపు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాతో పవన్ కళ్యాణ్ ఈ సీటును ఎంచుకున్నారు. ఇక్కడున్న 2.80 లక్షల ఓట్లలో సుమారు 91 వేల పైచిలుకు ఓట్లు కాపు సామాజికవర్గానివే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. మరోవైపు పవన్‌కు పోటీగా వైసీపీ కాపు సామాజిక వర్గానికే చెందిన మహిళా నేత వంగా గీతను బరిలోకి దింపుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.