ఏపీలో ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. తమ పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థులను సైతం ప్రకటిస్తు్న్నాయి. శనివారం వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు టీడీపీ ఇప్పటికే 128 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది. జనసేన కూడా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా .. కాంగ్రెస్, వామపక్షాలు గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ఉన్నాయి.
అయితే ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఏకంగా ఐదుగురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు బరిలో ఉంటున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ, టీడీపీ, జనసేన ప్రకటించిన జాబితాలో ఐదుగురు మాజీ సీఎంల కొడుకులకు సీట్లు దక్కాయి. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, వైసీపీ పార్టీ స్థాపించి, తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్.. ఈసారి కూడా తన ఇలాఖా పులివెందులలో బరిలోకి దిగుతున్నారు. పులివెందుల నుంచి జగన్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈసారి మంగళగిరి నుంచి బరిలో నిలిచారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చిన లోకేష్.. ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే ధోరణితో 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే లోకేష్ పోటీ చేస్తున్నారు. మరోవైపు లోకేష్‌కు పోటీగా వైసీపీ లావణ్య అనే బీసీ అభ్యర్థిని బరిలో నిలిపింది.
ఇక మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఈసారి కూడా హిందూపురం నుంచే బరిలో నిలుస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుఫున విజయం సాధించిన బాలకృష్ణ.. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారు. మరోవైపు వైసీపీ తరుఫున ఇక్కడ నుంచి దీపిక బరిలో ఉన్నారు. మరోవైపు మరో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున తెనాలి నుంచి బరిలో దిగుతున్నారు. జనసేన అధిష్టాం ఇప్పటికే అక్కడి నుంచి ఆయన పేరును ప్రకటించింది. మరో సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ టీడీపీ తరుఫున డోన్ నుంచి ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ షర్మిల, పురంధేశ్వరి కూడా ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అయితే వారెక్కడి నుంచి పోటీ చేస్తారనేదీ ఇంకా స్పష్టం కాలేదు.