జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని భావించినా.. ఎన్నికల సంఘం మాత్రం ఆ దిశగా ప్రకటన చేయలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30 వ తేదీ లోపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి తీరుతామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే జమ్మూ కాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ కాగా.. మరొకటి లఢఖ్.
దీంతో జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరగనున్నాయి. ప్రస్తుతానికి లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం లేదని రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు 5 దశల్లో నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించారు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లో ఐదు విడతల్లో పోలింగ్ జరగనుందని తేల్చి చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌ను.. జమ్మూ కాశ్మీర్, లఢఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించగా.. జమ్మూ కాశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలు, లడఖ్‌లో ఒక ఎంపీ స్థానం ఉన్నాయి. ఇక శనివారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌లో దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 వ తేదీన ప్రారంభం కానున్న తొలి దశ పోలింగ్.. జూన్ 1 వ తేదీతో ఏడో దశ పోలింగ్ ముగియనుంది. ఇక సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును జూన్ 4 వ తేదీన చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో గత 6 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇక జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని.. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో దాఖలైన పిటిషన్లు అన్నింటిపైనా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 30 వ తేదీ లోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి.. సెప్టెంబర్ 30 వ తేదీ లోపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.