ఈసారి ఉభయ రాష్ట్రాల్లో పోలింగ్ మండే ఎండల్లో జరగనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి సమస్య మొదలైంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నాటికి ఎండల తీవ్రత పెరుగుతుందని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇరు రాష్ట్రాలకు ఒకేసారి తొలిదశలోనే పోలింగ్ పెట్టడంతో ఎండల బాధ తక్కువగా ఉంది. 2014లో కూడా ఏప్రిల్ చివరివారంలో తెలంగాణ, మే మొదటివారంలో ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయి. 2014లో పది ఫేజుల్లో ఎన్నికలు జరిగినపుడు తెలంగాణ ఎనిమిదవ ఫేజ్‌లో ఏప్రిల్ 30న ఏపీ తొమ్మిదవ ఫేజ్‌లో మే 7న పోలింగ్ జరిగింది. మే 16న ఫలితాలు వెలవడ్డాయి. 2019లో ఏడు దశల్లో లోక్‌సభ పోలింగ్ జరిగినపుడు తెలంగాణ, ఏపీలకు ఒకేసారి మొదటి దశలో ఏప్రిల్ 11న పెట్టారు. మే 23న ఫలితాలు వచ్చాయి. 2024లో ఏడు దశల్లో ఎన్నికలు పెడుతున్నారు. తెలంగాణ, ఏపీలు కలిపి నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి.