చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘వికసిత్ భారత్, వికసిత్ ఏపీ కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు రావాలి. ఎన్డీయే ప్రభుత్వం పేదలకు సేవ చేస్తుంది. జనాభాలో 30కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చింది’’ అని మోదీ పేర్కొన్నారు. ఏపీలోని పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద పది లక్షల ఇళ్లు ఇచ్చామని, పల్నాడు ప్రాంతానికి ఐదు వేల ఇళ్లు వచ్చాయని మోదీ తెలిపారు. తాగడానికి పేదలకు శుభ్రమైన నీరిచ్చే జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఏపీలో కోటి కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ అనే బృహత్తర కార్యక్రమం కింద కోటి మందికి వైద్య భరోసా కల్పించామన్నారు. పల్నాడు ప్రాంతంలోని ఐదు లక్షల మందికి కేంద్రం ఉచిత రేషన్ ఇస్తోందని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏపీలో రైతులకు రూ.700కోట్లు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలన్నారు. ‘‘ఎన్డీయేకు చెందిన ప్రతి ఎంపీ మీ కోసమే పని చేస్తారు. ఇది మోదీ గ్యారెంటీ’’ అంటూ ప్రధాన మంత్రి మాటిచ్చారు.