ఈ ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మింది ప్రజలంతా ఏకపక్షంగా ఓటు వేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. మింది గ్రామ ప్రజలతో ఆదివారం రాత్రి 68 వ వార్డు వైయస్ఆర్‌సీపీ ఇన్చార్జ్ గుడివాడ లతీష్ అధ్యక్షతన మింది కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఏ సందర్భం వచ్చినా మింది ప్రజలు నా కుటుంబ సభ్యులుగా నా వెంట నిలబడి ఉంటారన్న ధైర్యం నాకు ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు. తన తండ్రి మరణం తర్వాత మా కుటుంబమంతా ఆవేదనతో ఉన్న సమయంలో మళ్లీ మా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు మింది ప్రజలు అందించిన సహకారాన్ని తాను ఎప్పుడూ మరువలేనని అమర్నాథ్ స్పష్టం చేశారు. 20 సంవత్సరాలుగా తమను అవమానిస్తూ, ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు మన సహకారం కోసం ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం మీరేనంటూ మింది వాసులకు అమర్నాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గుడివాడ కుటుంబం మూడు తరాల రాజకీయ అనుభవం గురించి దేశ విదేశాలలో కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని ఇందుకు తాను గర్వపడుతున్నారని అమర్నాథ్ చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డారు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే దీనికి ముఖ్య కారకులు మీరే" అని అమర్నాథ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. చాలా కాలం తర్వాత తను పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం లభించిందని అమర్నాథ్ చెప్పారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పల్లా సింహాచలం, తన తండ్రి గుడివాడ గురునాథరావు పోటీ చేశారని, ఆ ఎన్నికల్లో గురునాథరావు ఘనవిజయం సాధించారని, ఇప్పుడు వారి వారసులం ఎన్నికల బరిలో ఉన్నామని ఈసారి కూడా విజయం గుడివాడ కుటుంబానికి దక్కాలని మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు.