ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ ఈ సమన్లను "రాజ్యాంగ విరుద్ధం మరియు ఏకపక్షం" అని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టనుంది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న విచారణకు హాజరుకావాలని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ కేజ్రీవాల్‌కు తొమ్మిదో సమన్లు జారీ చేసింది.2022లో కేసు నమోదైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, ఆప్ నేతలు సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, కొందరు మద్యం వ్యాపారులతో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరు ఛార్జిషీట్లు దాఖలు చేసి రూ.128 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.