జనసేన అధిపతి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి రీసెంట్‌గా భగత్స్ బ్లేజ్ పేరిట ఒక టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సంగతిని పక్కన పెడితే.. ఇందులో పవన్ గాజు గ్లాసుపై చెప్పిన డైలాగ్ మాత్రం పెను దుమారం రేపింది. ఇది పొలిటికల్ ప్రచారం తరహాలో ఉందంటూ కొన్ని వర్గాలవారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. తాను ఈ టీజర్ చూడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ టీజర్ పొలికల్ ప్రచారం తరహాలో ఉంటే.. అప్పుడు తప్పకుండా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని అన్నారు. ఆ టీజర్ చూస్తే కానీ.. ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని.. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని ముఖేష్ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు. సువిధ యాప్ ద్వారా సభలు, ప్రచారానికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. డీఎస్సీపై తాము విద్యాశాఖ వివరణ కోరామని, ఆ శాఖ నుంచి వివరణ రాగానే డీఎస్సీ నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని తెలిపారు. సీఈసీ నిర్ణయం ప్రకారం.. డీఎస్సీ వాయిదా వేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అంశాలను సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. ఇప్పటివరకూ ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల హోర్డింగులు, అలాగే ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగులను తొలగించామన్నారు. గత మూడు రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం, నగదు అక్రమ రవాణను అరికట్టామని.. వాటిని సీజ్ చేశామని పేర్కొన్నారు. అలాగే.. మూడు రోజుల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి ఉద్యోగులు స్వయంగా ప్రచారం చేస్తే.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.