తనపై సోషల్ మీడియాలో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. శనివారం నాడు సచివాలయంలోని సీఈఓ ఆఫీసుకు వచ్చారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విశాఖ పోర్టులో పట్టుకున్న డ్రై ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ వ్యవహరం సంబంధం ఉన్నవాళ్లతో తనకు ముడిపెడుతూ పోస్టింగ్‌లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తాను ఆ కంటైనర్ బుక్ చేయలేదని.. కంపెనీలో షేర్ హోల్డర్ కాదని, భాగస్వామిని కాదని స్పష్టం చేశారు. సీబీఐ ఆ కంపెనీనే తప్పుచేసిందని ఇంకా చెప్పనే లేదన్నారు. వారితో ఉన్న ఫొటోను తనకు జోడించి పెట్టడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయంపై అడిషనల్ సీఈఓకు ఫిర్యాదు చేశానని అన్నారు.ఈ అంశంపై సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ కోరుతామని అడిషనల్ సీఈవో చెప్పారని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.