తొలుత టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని జనసేన పార్టీ టీడీపీని కోరింది. పెందుర్తి, భీమిలి, గాజువాక, ఎలమంచిలి స్థానాలను అడిగినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలను విడుదల చేశారు. అనూహ్యం గా అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ పేరును ప్రకటించారు. కొద్ది రోజుల తరువాత కూటమిలో బీజేపీ చేరడంతో సమీకరణాలు మారిపోయాయి. పెందుర్తి, ఎలమంచిలితోపాటు విశాఖ దక్షిణ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్.. పెందుర్తికి పంచకర్ల రమేశ్‌బాబు, ఎలమంచిలికి సుందరపు విజయకుమార్ పేర్లను ఖరారు చేసి, ఎన్నికల ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్‌పై వంశీకృష్ణ శ్రీనివాస్‌కు కూడా హామీ లభించింది. అయితే ఆదివారం ప్రకటించిన మలివిడత జాబితాలో దక్షిణ నియోజకవర్గం ప్రస్తావనలేకపోవడంతో వంశీకృష్ణతో పాటు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.