ప్రముఖ పత్రికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరువునష్టం దావాకు సిద్ధమయ్యారు. విశాఖలో డ్రగ్స్ దిగుమతి వ్యవహారానికి సంబంధించి తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ సోదాలు నిర్వహించిన సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో పురందేశ్వరి కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందంటూ పత్రిక ఆధార రహిత వార్తలు ప్రచురించిందని ఆమె ఆరోపిచారు. తప్పుడు కథనాలపై న్యాయ పోరాటానికి సిద్ధమైన పురందేశ్వరి... రూ.20కోట్లకు ఆ పత్రిక యాజమాన్యానికి పరువు నష్టం నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్‌పోర్ట్ ఎండీ వీరభద్రరావుతో వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు రాయడం వెనుక దురుద్ధేశం ఉందని, కూనం కుటుంబంతో తనకు బంధుత్వం, వ్యాపార భాగస్వామ్యం ఏదీ లేదని స్పష్టం చేశారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనను డ్రగ్స్ వ్యాపారాలకు సంబంధించిన కంపెనీల్లో భాగస్వామి అనడం రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడమేనని పేర్కొన్నారు. ఆ వ్యవహారంతో సంబంధం లేదని వివరణ ఇచ్చినా పదేపదే అవే రాతలు రాయడం వెనుక ఉన్న తన పరువుకు భంగం కలిగించే ఉద్ధేశమేనని పురందేశ్వరి నోటీసులో వివరించారు. పద్నాలుగు రోజుల్లో తన నోటీసుకు ఆధారాలతో సహా సమాధానం ఇవ్వకపోతే కోర్టులో కేసు నమోదు చేస్తానని అందులో పేర్కొన్నారు.