రంగుల పండుగ హోలీని ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి ప్రాంతంలోని తాజంగి గ్రామంలో ఏటా ఫాల్గుణ మాసం శుక్లపక్షం రోజున హోలీ పండగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒడిశా నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో ఏళ్ల కిందట వలస వచ్చిన పూర్వీకుల సంప్రదాయాన్ని వారి వారసులైన ఇక్కడి గిరిజనులు నేటికీ కొనసాగిస్తున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా సుమారు 70 అడుగుల ఎత్తులో కట్టెలతో హోలీ టవర్ ఏర్పాటు చేశారు. పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య తెల్లవారుజామున అత్యంత భక్తి శ్రద్దలతో భక్తప్రహ్లాద హెూమం చేసి కట్టెల టవర్‌ను వెలిగించారు. కట్టెల టవర్‌పై కట్టిన జెండా ఎటువైపు పడుతుందో ఆ వైపు ప్రాంతంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని గిరిజనుల నమ్మకం. పడుతున్న జెండాను ఎవరు పట్టుకుంటారో వారిని నగదు బహుమతితో సత్కరించి గ్రామంలో ఘనంగా ఊరేగించడం మరో ఆనవాయితీ. హోలీ ముందు రోజైన పౌర్ణమి నాడు దేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. సాయంత్రం రాధాకృష్ణులు, పాకలపాడు గురుదేవుల విగ్రహ ప్రతిమలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, తప్పెట, కోలాటాలు ఆకట్టుకున్నాయి.