ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఈ సారి సొంత నియోజకవర్గం కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా.. సోమవారం నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలతో ముఖాముఖి నిర్వహించారు టీడీపీ అధినేత. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పానికి వస్తే చాలు రీఛార్జ్ అవుతానన్న చంద్రబాబు.. కుప్పం నుంచి తన గెలుపును మరోసారి రెన్యువల్ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే టీడీపీకి ఓటేస్తేనే ఇంట్లో మగవాళ్లకు తిండిపెట్టాలని మహిళలకు చంద్రబాబు సూచించారు.
"ఇంట్లో మగవాళ్లు ఓటేయకుంటే తిండిపెట్టడం మానేయండి. ఎన్నికల రోజు చెప్పండి. తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. తెలుగుదేశానికి ఓటేస్తేనే ఇంట్లోకి రానిస్తాం. భోజనం పెడతామని చెప్పండి. ఎక్కడికీ పోరు" అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పాలనలో జేబ్రాండ్ పేరుతో నకిలీ మద్యం విక్రయించారన్న చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశం గర్వించేలా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని అన్నారు. జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి.. రూ.100 లాక్కోమని.. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. అవసరమైతే మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలన అంతం కావాలంటే లక్ష మెజార్టీతో కుప్పంలో తనను గెలిపించాలని కోరారు.
మరోవైపు మార్చి 27 నుంచి చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరిట, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. ఇప్పటికే మార్చి 31 వరకూ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. అలాగే జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి పోల్ మేనేజ్‍మెంట్ పైనా ప్రణాళికలు రచిస్తున్నారు.