ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు టికెట్ రాకపోవడానికి ఆయనే కారణం.. జగన్‌తో కలిసి కుట్ర, నా నిర్ణయం ఇదే: రఘురామ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 07:30 PM

టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించిన 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చోటు దక్కలేదు. నరసాపురం లోక్‌సభ స్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్‌ కేటాయించారు. రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. నరసాపురం టికెట్‌ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని.. తాను ఎన్నికల బరిలో ఉన్నా, లేకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానన్నారు.


  నరసాపురం పోటీకి తనకు అవకాశం రాకుండా సీఎం జగన్‌ అడ్డుపడ్డారని చెప్పారు. టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. మొదటి నుంచి సీఎం జగన్‌ అవినీతిపైన, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన దండెత్తిన ఆయనకు అటు బీజేపీ, ఇతర పార్టీలు గాని అవకాశం లేకుండా చేయడం దారుణమని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, సందేశాలు పంపారన్నారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నాననీ చెప్పడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి షాక్‌ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుంచి టికెట్‌ రానివ్వరని ముందే కొందరు చెప్పారన్నారు.


జగన్‌ తనను డిస్‌క్వాలిఫై చేయాలని చూశారని.. జైల్లో చంపే ప్రయత్నం చేశారన్నారు. తన మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై తనను అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో చంపేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని లేపేయాలని చూశారని.. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదన్నారు. తనకు టికెట్‌ రాకుండా తాత్కాలికంగా జగన్‌ విజయం సాధించారని.. అపజయాన్ని అంగీకరిస్తున్నానన్నారు. జగన్‌ ఇంత పని చేస్తారని తెలిసినా.. ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నానన్నారు. గత నాలుగేళ్లుగా జగన్‌ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేశానన్నారు. ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని.. రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘురామ కాదన్నారు.


జగన్‌ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదన్నారు. కొందరు బీజేపీ నేతలకు జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేనని.. ఓ నేత ద్వారా టికెట్‌ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందన్నారు. నరసాపురం నుంచి పోటీచేస్తానా? మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. జగన్‌ అనుకున్నది మాత్రం జరగనివ్వను అన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని.. జగన్‌ చీప్‌ ట్రిక్స్‌ పనిచేయవన్నారు. పదవే అనుభవించాలని కోరిక ఉంటే, జగన్‌కు తలొగ్గితే.. నాలుగేళ్లపాటు ఢిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. పనికిమాలిన వైఎస్సార్‌సీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశానని భావించడం వల్లే ప్రాణాలకు తెగించి పోరాటం చేశానన్నారు. అమరావతి రైతులకు చేసిన అన్యాయం, సొంత బాబాయిని హత్య చేయించిన వైనం, కోడికత్తి దాడి లాంటి ఆగడాలు చూసిన తర్వాత అంతరాత్మ అంగీకరించక జగన్‌పై తిరుగుబాటు చేశానన్నారు.


మంచి ఆశయాలు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో, ఎంతోమంది ఆదరాభిమానాలను కురిపిస్తున్నా.. టీడీపీ ఉండగా మరో పార్టీ ఎందుకని ఆలోచించానన్నారు. అదే దృక్పథంతో కొనసాగుతున్నానని.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చన్నారు. దీన్ని మోసం, అన్యాయం అని తాను అనడం లేదని.. ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే గొంతు వినిపించే ప్రయత్నంలో ఉంటానన్నారు. పార్టీలు అన్యాయం చేసినా ప్రజలు అన్యాయం చేయరనే నమ్మకంతో ఉన్నానని.. కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక సమస్యలు ఉండవన్నారు. పక్క పార్టీలోనూ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పాలకపక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజలతో కలిసి పోరాటం చేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com