ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెక్చర్లు వద్దు.. మీ ఉగ్ర ఫ్యాక్టరీలు మూసేయండి: పాక్‌కు తలంటిన భారత్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 10:30 PM

అంతర్జాతీయ వేదికపై భారత్‌ను బద్నాం చేయడానికి ప్రయత్నించిన దాయాదికి మరోసారి భంగపాటు తప్పలేదు. జెనీవా వేదికగా జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ కడిగిపారేసింది. ప్రజాస్వామ్యం, మానవహక్కులపై చిలకపలుకులు పలికిన పాక్‌కు కౌంటర్ ఇచ్చింది. ఉపన్యాసాలు చాలించి.. ఉగ్రవాదాన్ని అరికట్టాలని హితవు పలికింది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలను మూసివేయడంపై దృష్టిపెట్టాలని దాయాది చెంపచెళ్లుమనిపించేలా బదులిచ్చింది. ఆదివారం జరిగిన ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ) 148వ సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌, లఖఖ్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.


 ఈ సమావేశంలో భారత్‌ తరఫున పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌.. ‘రైట్‌ టు రిప్లై’ అవకాశం కింద స్పందించారు. పాక్‌ ప్రతినిధి ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత చెత్త రికార్డు ఉన్న ఆ దేశం (పాకిస్థాన్‌) మాకు ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదం. ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు, తప్పుడు కథనాలతో ఐపీయూ లాంటి అంతర్జాతీయ వేదిక ప్రతిష్ఠను దెబ్బతీయరాదు. జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌ అప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. కట్టుకథలు, అబద్దాలతో ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు’ అని హరివంశ్‌ కౌంటర్ ఇచ్చారు.


అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి అంతర్జాతీయ ఉగ్రవాది ఎక్కడ దొరికాడో గుర్తుచేసుకోవాలని చురకలంటించారు. ‘ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదుల్లో చాలా మందికి ఆశ్రయం కల్పించిన దేశంగా ఘనమైన రికార్డు పాక్ సొంతం. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారి కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా ఉన్న చరిత్ర వారిది. ఇకనైనా తమ ప్రజల మేలు కోసం పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకోవాలి. జమ్మూ కశ్మీర్‌లో సీమాంతర దాడులకు పాల్పడుతున్న ఉగ్ర కర్మాగారాలను మూసివేసేందుకు ప్రయత్నించాలి’ అని భారత్‌ హితవు పలికింది.


గత నెలలోనూ ఐరాస మానవహక్కుల కమిషన్ 55వ సమావేశంలోనూ జమ్మూ కశ్మీర్‌‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఆరోపించగా.. భారత్ ప్రతినిధి అనుపమ సింగ్ వాటిని తిప్పికొట్టారు. పాక్‌లో మానవ హక్కుల రికార్డు అధ్వాన్నంగా ఉందని ఉదాహరణలతో ఎత్తి చూపారు. ‘రక్తంలో తడిసి ముద్దయినా మాట్లాడే దేశంపై మనం ఇంకేమీ దృష్టి పెట్టలేం.. ప్రపంచవ్యాప్తంగా అది ఎగుమతి చేస్తున్న తీవ్రవాదం చేస్తోన్న రక్తపాతం ఎరుపు; అప్పుల ఊబిలో కూరుకుపోయిన జాతీయ బ్యాలెన్స్ షీట్ల ఎరుపు; ఎరుపు రంగు ప్రభుత్వం తమ వాస్తవ ప్రయోజనాలను నెరవేర్చడంలో విఫలమైందని స్వంత ప్రజలు భావిస్తున్నారు’ ఆమె తూర్పారబట్టారు. మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa