ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. ఈడీ అదుపులోన్న ఉన్న ఆయన జైలు నుంచే పాలన సాగిస్తుండటం సంచలనంగా మారింది. రెండు రోజుల కిందట ఆయన కస్టడీ నుంచి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో తాజాగా కేజ్రీవాల్ మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మంగళవారం ఉదయం లాకప్ నుంచి ముఖ్యమంత్రి రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు.
మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘అయన (కేజ్రీవాల్) కస్టడీలో ఉన్నా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు.. నిరుపేద వ్యక్తి మందులు పొందడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వాటిని పొందాలి. మధ్యతరగతి వ్యక్తి ఔషధాలు కొనుగోలు చేయవచ్చు.. కానీ, ఢిల్లీలోని లక్షలాది నిరుపేద కుటుంబాలు ఔషధాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. వీరిలో కొందరు జీవితాంతం ఔషధాలు తీసుకోవాలి’ అని అన్నారు.
‘అంతేకాదు, చాలా మంది ప్రజలు రోజువారీ రక్త పరీక్షల కోసం మొహల్లా క్లినిక్‌లపై ఆధారపడ్డారు.. కొన్ని మొహల్లా క్లినిక్స్‌లో ఉచిత పరీక్షలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సీఎం దృష్టికి వెళ్లాయి.. కాబట్టి అన్ని ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్స్‌లో ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.. కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నా ఆయన మనసు మాత్రం ప్రజల కోసమే పరతపించిపోతుంది’ అని మంత్రి చెప్పారు.
కాగా, రెండు రోజుల కిందట ఢిల్లీ తాగునీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిషికి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈడీ.. ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని చెబుతోంది. అటువంటిది ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిషిని ప్రశ్నించే అవకాశముంది.
మరోవైపు, తమ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. మోదీ నివాసం వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa