ఏపీ రాజకీయాల్లో నేతల గోడదూకుళ్లు ఎక్కువయ్యాయి. ఉదయం వరకూ ఓ పార్టీలో ఉన్న నేతలు.. సాయంత్రానికల్లా పార్టే మార్చేస్తున్నారు. టికెట్ రాలేదనే అసంతృప్తితోనే, లేదా పార్టీలో గౌరవం లేదనే అభిప్రాయంతోనే కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు పార్టీ మారుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ఈసారి మాగంటి బాబుకు కాకుండా యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కు టీడీపీ అధిష్టానం కట్టబెట్టింది. పుట్టా మహేష్ యాదవ్ రాయలసీమ నేత. ఆయనకు కోస్తాలో టికెట్ కట్టబెట్టడంతో మాగంటి బాబు అసంతృప్తికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతున్నారంటూ మంగళవారం వార్తలు వెలువడ్డాయి.
మాగంటి బాబు వైసీపీలో చేరుతున్నారని, వైఎస్ జగన్ సమక్షంలో ఆయన ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకుంటారంటూ మంగళవారం ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై మాగంటి స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. 24 గంటలుగా జరుగుతున్నదంతా వట్టి ప్రచారమేనని తేల్చేశారు. తాను పార్టీ మారటం లేదని, టీడీపీలోనే ఉంటానంటూ కార్యకర్తల సమావేశంలో మాగంటి బాబు క్లారిటీ ఇచ్చారు. 'గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు' అని మాగంటి బాబు కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ఏలూరు ఎంపీ టికెట్ టీడీపీలో నిప్పు రాజేసింది. మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, యనమల రామకృష్ణుడు అల్లుడు అయిన పుట్టా మహేష్ యాదవ్‌కు ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వటంతో సైకిల్ పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంట్ టీడీపీ మాజీ ఇంఛార్జి గోరుముచ్చు గోపాల్ యాదవ్.. టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. గోరుముచ్చు గోపాల్ యాదవ్ టీడీపీ తరుఫున ఏలూరు ఎంపీ టికెట్ ఆశించారు. అయితే ఊహించని విధంగా ఏలూరు ఎంపీ టికెట్‌ను పుట్టా మహేష్ యాదవ్‌కు కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. అలాగే మాగంటి బాబు సైతం వైసీపీ గూటికి చేరతారనే వార్తలు రాగా.. ఆయన వాటికి ఖండించారు.