ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజా గళం పేరుతో సభలతో దూకుడు పెంచారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా శనివారం నుంచి ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) ఉమ్మడి కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ మీదుగా KGN ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
చంద్రబాబు ప్రజా గళం సభలు
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజా గళం ఇవాళ నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలంలో నిర్వహిస్తారు. ఈ మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే 30న మైదుకూరు, సూళ్లూరుపేట, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి ప్రచారంలో బాబు పాల్గొంటారు. 31న మార్కాపురం, సంతనూతలపాడు, కావలి, ఒంగోలులో పర్యటిస్తారు.
సీఎస్, డీజీపీపై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన పలువురు ‘ఛేంజ్ డాట్ ఓఆర్‌జీ’ వెబ్‌సైట్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్ పంపారు. మూడురోజుల కిందట ఈ పిటిషన్ మొదలుపెట్టగా.. గురువారం సాయంత్రం వరకూ ఈ డిమాండుకు 1,651 మంది మద్దతు పలికారు.
నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్
అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైఎస్సార్‌సీపీ కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇందుకోసం రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై అధినేత చంద్రబాబు, లోకేష్ పునరాలోచన చేయాలని కోరారు. సమస్య పరిష్కారానికి చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్ చేశారు. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో తనకు జరిగిన అన్యాయం గురించి రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు వద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa